: మహమూద్ అలీపై నెటిజన్ల ఫైర్!... సింధుకు మెరుగైన కోచ్ అంటూ చేసిన వ్యాఖ్యలే కారణం!
తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీపై నెటిజన్లు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ‘‘కోచ్ గా గోపీచంద్ ఓకే. అయినా పీవీ సింధుకు మెరుగైన కోచ్ కోసం అన్వేషిస్తున్నాం’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణంగా నిలిచాయి. రియో ఒలింపిక్స్ నుంచి నిన్న హైదరాబాదు చేరుకున్న పీవీ సింధు, పుల్లెల గోపీచంద్ కు తెలంగాణ సర్కారు ఘన స్వాగతం పలికింది. ఈ సందర్భంగా జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఏర్పాటు చేసిన వేదికపై వారిద్దరినీ ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా మహమూద్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు నిమిషాల్లోనే వైరల్ గా మారిపోయాయి. గోపీచంద్ లాంటి కోచ్ ను వదులుకుంటామన్న రీతిలో ఆయన చేసిన వ్యాఖ్యలు నెటిజన్లను ఆగ్రహావేశాలకు గురి చేశాయి. ‘ఫూలిష్ వ్యాఖ్యలు కట్టిపెట్టండి’ అంటూ మొదలైన నెటిజన్ల కామెంట్లు... ‘తెలంగాణకు ఓ బెటర్ డిప్యూటీ సీఎం కావాలి’ అనే దాకా వెళ్లాయి.