: వ్యాపారిని ఫోన్‌లో బెదిరించి కోటిరూపాయలు డిమాండ్ చేసిన నయీమ్.. మీడియాకు చిక్కిన ఆడియో
ఇటీవలే పోలీసుల చేతిలో హతమైన గ్యాంగ్ స్టర్ నయీమ్ ఆగడాలు ఒక్కొక్కటిగా బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా నయీమ్ ఒక వ్యాపారిని బెదిరిస్తోన్న ఆడియో ఒకటి మీడియాకు చిక్కింది. నల్గొండ జిల్లా భువనగిరికి చెందిన వ్యాపారిని ఫోన్‌లో బెదిరించిన నయీమ్.. కోటిరూపాయలు డిమాండ్ చేశాడు. కోటిరూపాయలు ఇవ్వకపోతే వ్యాపారి కుటుంబ సభ్యులను చంపుతానంటూ నయీమ్ బెదిరించాడు. వ్యాపారి ఫోనులో ఎంతగా వేడుకున్నా కోటి రూపాయలు ఇవ్వాల్సిందేనని నయీమ్ బెదిరించాడు. లేకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించాడు. మరోసారి వ్యాపారికి ఫోన్ చేయనని, డబ్బు ఇవ్వకపోతే ఏం చేస్తానో అది చేసి చూపిస్తానని నయీమ్ ఫోనులో బెదిరించాడు. కోటి రూపాయలు ఇస్తే సరి.. లేదంటే అంతేసంగతని హెచ్చరించాడు. నయీమ్ వ్యాపారితో ‘నువ్వు మంచిగుంటే నేను మంచిగుంటా.. నీకిగ దేవుడే గతి.. నీకు భయం లేకుండా పోతోంది. ఈరోజు ఒక నెల సమయం అడుగుతున్నావ్.. ఒక నెల సమయం ఇవ్వలేను. నీ మీద నాకు అనుమానం ఉంది. నెల రోజులు ఇవ్వలేను. ఈరోజు సాయంత్రం వరకు సగం.. ఆ తరువాత సగం డబ్బు ఇవ్వాలి’ అని నయీమ్ అన్నాడు. దీంతో వ్యాపారి ‘నీకు దండం పెడుతా.. కాళ్లు మొక్కుతా.. నాకు నెల రోజుల సమయం ఇవ్వు.. ఈ నెల 31వ తేదీని ఇస్తా’ అని నయీమ్ ని కోరాడు. దీంతో నయీమ్ ‘ఒక్క నెల రోజుల్లో నేను చచ్చిపోతే పైసలు మిగులుతాయనుకుంటున్నావేమో! జాగ్రత్త’.. అని బెదిరించాడు. మొదట 15 రోజుల టైమ్ ఇస్తానన్న నయీమ్ ఆ తరువాత నెల రోజులు గడువు ఇచ్చాడు. కాల్ చేసిన నెలలో 31 వ తేదీకి డబ్బు ఇచ్చేయాలని ఆదేశించాడు.