: విశాఖలో బోర్డు తిప్పేసిన సాఫ్ట్ వేర్ కంపెనీ!... 350 మంది నుంచి కోటి వసూలు చేసి పరారీ!
సాఫ్ట్ వేర్ కంపెనీ పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేసిన మాయగాళ్లు నిరుద్యోగులకు టోపీ పెట్టారు. విశాఖలో వెలుగుచూసిన ఈ మాయాజాలం వివరాల్లోకెళితే... పీసీ టెక్నాలజీస్ పేరిట సాఫ్ట్ వేర్ కంపెనీని నెలకొల్పిన కొందరు వ్యక్తులు మంచి వేతనాలతో ఉద్యోగాలిస్తామని భారీ ప్రకటనలు జారీ చేశారు. వారి ప్రకటనలకు ఆకర్షితులైన దాదాపు 350 మంది నిరుద్యోగులు సదరు కంపెనీని సంప్రదించారు. ముందుగా కొంతమేర డిపాజిట్లు చెల్లించాలని చెప్పిన కంపెనీ... సెక్యూరిటీ డిపాజిట్ల పేరిట బాధితుల నుంచి కోటి రూపాయల మేర వసూలు చేసింది. ఆ తర్వాత గుట్టుచప్పుడు కాకుండా బోర్డు తిప్పేసిన ఆ కంపెనీ యజమానులు చల్లగా ఉడాయించారు. దీంతో మోసపోయామని గుర్తించిన బాధితులు నేటి ఉదయం నగర పోలీస్ కమిషనర్ ను ఆశ్రయించారు. కమిషనర్ ఆదేశాల మేరకు కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి మాయగాళ్ల ఆచూకీ కోసం గాలింపు మొదలుపెట్టారు.