: ఇకపై ఎగిరే ట్యాక్సీల్లో గాల్లో ప్రయాణం చేయొచ్చట!
ఎడ్లబండి, జట్కాబండిలో ప్రయాణం చేసే రోజులనుంచి కాలక్రమంలో అత్యంత అధునాతన ప్రయాణ సాధనాలు కొత్తకొత్తవి పుట్టుకొచ్చాయి. ఈ క్రమంలోనే రోడ్లు, నీరు, గాల్లో ఎగిరే రవాణా సాధనాలు ఎన్నో వచ్చాయి. గాల్లో విమానం, హెలికాప్టర్, రాకెట్, డ్రోన్ వంటివే ప్రయాణిస్తుండడం ఇంతవరకూ చూశాం. ఇకపై మనం ఫ్లైయింగ్ ట్యాక్సీలను కూడా చూడవచ్చు. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్‌తో పనిచేసే ‘అటానమస్ ఫ్లైయింగ్ ట్యాక్సీ’లను తాము త్వరలోనే తీసుకురానున్నట్లు ప్రముఖ విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్ పేర్కొంది. ఇవి గనుక అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని భావిస్తున్నారు. ఇప్పటికే గూగుల్, ఉబర్, ఐబీఎం వంటి పలు సంస్థలు స్వయం నియంత్రిత వాహనాలను తయారు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డ్రైవర్‌లెస్ కార్లను, బస్సులను రోడ్లపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. అయితే ఎయిర్ బస్ ఇంకాస్త వేగంగా ఆలోచించి, గాల్లో దూసుకెళ్లే స్వయం నియంత్రిత ట్యాక్సీలను తీసుకువస్తోంది. దీని కోసం తీవ్ర కసరత్తే చేస్తోంది. డ్రోన్లను పోలి ఉండే ఈ ఫ్లైయింగ్ ట్యాక్సీలకు ‘సిటీ ఎయిర్‌బస్’ అని నామకరణం చేశారు. ప్రయాణికులను, సరుకులను ఒక చోటినుంచి మరొకచోటుకి చేరుస్తూ సిటీ ఎయిర్‌బస్ సేవలందించనుంది. స్మార్ట్‌ఫోన్ సాయంతో ఇచ్చే కమాండ్‌తో ఈ సిటీ ఎయిర్‌బస్ ఒకచోటు నుంచి మరోచోటుకి తిరుగుతుందట. ఆరునెలల ముందే ఎయిర్‌బస్ సంస్థ వీటి తయారీని ప్రారంభించింది. వచ్చే ఏడాది తొలి డిజైన్‌ను పరీక్షించనుంది. మరో పదేళ్లలో ఈ ఎగిరే సిటీ ఎయిర్‌బస్‌లు పూర్తి స్థాయిలో ప్రయాణికుల ముందుకు రానున్నాయి. ఇవి ప్రయాణించేటప్పుడు వాటంతంట అవే ఎయిర్ ట్రాఫిక్‌ను గుర్తించే వ్యవస్థను సవాల్‌గా తీసుకుని తాము వీటిని రూపొందిస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.