: ఇండియాలో ఉద్యోగాలు కోల్పోనున్న లక్ష మంది టెక్కీలు: జిన్నోవ్ నివేదిక


2021 నాటికి ఇండియాలో టెక్నాలజీ ఆధారిత ఉద్యోగాలు నిర్వహిస్తున్న వారిలో కనీసం 94 వేల మంది ఉపాధిని కోల్పోనున్నారని కన్సల్టింగ్ సంస్థ జిన్నోవ్ తన తాజా నివేదికలో పేర్కొంది. ఐటీ కంపెనీలు, స్టార్టప్ సంస్థలు ఐఓటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) వైపు అడుగులు వేస్తుండటమే ఇందుకు కారణమని అభిప్రాయపడింది. ఇంటర్నెట్ ను వాడుకుంటూ వివిధ రకాల సెన్సార్లు, చిప్స్ తదితరాలను మానిటరింగ్ చేయడంతో పాటు వాటిని నియంత్రించే వ్యవస్థ అందుబాటులోకి వస్తుండటంతో, ఈ రంగంలో ఉపాధి పొందుతున్న టెక్కీలు తమ ఉద్యోగాలకు దూరం కానున్నారని హెచ్చరించింది. మ్యాన్ పవర్ స్థానాన్ని మెషీన్లు ఆక్రమించనున్నాయని, దీని ఫలితంగా ఇన్ స్టాలేషన్, మెయిన్ టెనెన్స్, ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్, సూపర్ వైజర్స్ తదితర ఉద్యోగాలకు కోత పడనుందని పేర్కొంది. ఆటో, టెలికం, హెల్త్ కేర్ రంగంలో ఐఓటీ ప్రభావం అధికంగా ఉండనుందని జిన్నోమ్ అంచనా వేసింది. భారత కార్పొరేట్ కంపెనీలు ఐఓటీ విభాగంలో ఇప్పటికే 1.6 బిలియన్ డాలర్లు వెచ్చించాయని, 2021 నాటికి ఈ మొత్తం 3.8 బిలియన్ డాలర్లకు పెరగనుందని, ఇక ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఐదేళ్లలో ఐఓటీపై వెచ్చిస్తున్న మొత్తం 253 బిలియన్ డాలర్లకు చేరనుందని భావిస్తున్నట్టు తెలిపింది. ఇదే సమయంలో డేటా సైంటిస్ట్, ప్రొడక్ట్ మేనేజర్, రోబో కో-ఆర్డినేటర్, ఇండస్ట్రియల్ ప్రోగ్రామింగ్, సొల్యూషన్ ఆర్కిటెక్ట్, నెట్ వర్క్ ఇంజనీరింగ్ తదితర విభాగాల్లో ఉద్యోగ సృష్టి నమోదు కావచ్చని, ఐఓటీ విస్తరణ కారణంగా వచ్చే ఐదేళ్లలో 25 వేల మందికి ఉపాధి లభించనుందని జిన్నోమ్ అంచనా వేసింది.

  • Loading...

More Telugu News