: ముస్లిమేతర శరణార్థులకు ఐడీ కార్డులు, బ్యాంకు అకౌంట్లు: కేంద్రం
పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్థాన్ తదితర దేశాల నుంచి వచ్చి భారత్‌లో స్థిరపడిన ముస్లిమేతర శరణార్థులు ఇక నుంచి బ్యాంకు ఖాతాలు తెరవవచ్చు. స్వయం ఉపాధి కోసం ఆస్తులు కొనుగోలు చేసుకోవచ్చు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డ్, ఆధార్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పౌరసత్వం చట్టం సవరణ బిల్లు పార్లమెంటులో పాస్ కావడంతో ఇక నుంచి భారత్‌లో దీర్ఘకాలంగా నివసిస్తున్న ముస్లిమేతర శరణార్థులకు ఈ సేవలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. అస్థిర పరిస్థితులు, ఇతర కారణాలతో భారత్‌కు వచ్చి స్థిరపడిన ముస్లిమేతర మైనారిటీలను దేశ పౌరుల్లానే పరిగణిస్తామని, వారికి ఆధార్ సహా అన్ని ధ్రువపత్రాలను అందజేస్తామంటూ ఎన్నికల సందర్భంగా మోదీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీర్ఘకాల వీసా(ఎల్‌టీవీ)లపై భారత్‌లో నివసిస్తున్న మైనారిటీ శరణార్థులైన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్లు అఫిడవిట్ సమర్పిస్తే రెండేళ్లకు బదులు ఐదేళ్ల ఎల్‌టీవీ జారీ చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. విదేశీయుల కోటాలో శరణార్థుల పిల్లలు స్కూళ్లు, కాలేజీల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి లేకుండానే చేరవచ్చని పేర్కొంది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్థాన్ నుంచి వచ్చి భారత్‌లో స్థిరపడుతున్న రెండు లక్షల మంది శరణార్థుల్లో ఎక్కువ శాతం మంది హిందువులు, సిక్కులు, ఉన్నట్టు ప్రభుత్వం వివరించింది.