: ఆ ఊర్లో అందరూ సంస్కృతంలోనే మాట్లాడతారు.. ప్రతి ఇంట్లో ఇంజనీరింగ్ విద్యార్థి ఉంటాడు!
ఆ ఊర్లో అంతా సంస్కృత భాషే వినపడుతుంది. పక్క గ్రామం నుంచి ఆ ఊర్లోకి ఎవరొచ్చినా వారికి సంస్కృతంలోనే స్వాగతం లభిస్తుంది. ఎంతో చదువుకున్నారు.. కానీ సంస్కృతాన్నే వాళ్ల నాలుకలపై నాట్యం ఆడిస్తారు. ఆ ఊర్లోని మరో విశేషమమేంటంటే, ఏ ఇంటికెళ్లి చూసినా ఒక ఇంజినీరింగ్ విద్యార్థి కనపడతాడు. ప్రాంతీయ సంప్రదాయాలు, సంస్కృత భాషపై ఎంతో అభిమానం పెంచుకున్న కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా మట్టూర్ గ్రామం కథ ఇది. గ్రామంలో ఎన్నో ఏళ్ల తరబడి సంస్కృత భాష వికాసం కోసం అలుపెరుగని కృషిని కొనసాగిస్తూ ఆ భాష ఉనికిని కాపాడుతున్నారు. 1982 లో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఇప్పటికీ హిందూ శాస్త్రం అనుసరించిన సంస్కృతిని కాపాడే ప్రయత్నాల్ని కొనసాగిస్తున్నారు. సంస్కృత భాషను ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. గ్రామంలో ఓ వేదిక్ పాఠశాలను కూడా ఏర్పాటు చేసి తమ అభిమాన భాషపై శిక్షణను ఇస్తున్నారు. వేద పండితులు సంస్కృతం ఎలా ఉచ్చరిస్తారో అదే విధంగా ఉచ్చరించే విధానాన్ని విద్యార్థులకు నేర్పిస్తున్నారు. తాము తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆ గ్రామంలో ప్రతి ఇంటిలో తప్పకుండా సంస్కృత భాష మాట్లాడతారు. గ్రామవాసులు వేదిక్ జీవన సరళినీ పాటిస్తారు. ఎంతో కష్టంగా కాదు, ఎంతో ఇష్టంగా వారు ఈ పనిని కొనసాగిస్తున్నారు. దీంతో సంస్కృత భాషను కాపాడటంలో ఆ గ్రామం ప్రత్యేక గుర్తింపు పొందింది. మనది ద్రవిడ సంస్కృతేనన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ గ్రామప్రజలు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ద్రవిడ భాషలయిన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు సంస్కృత భాషను మిళితం చేసి ‘సాంకేతిక’ అనే నూతన భాషా సరళిని రూపొందించి సంస్కృత భాష అభివృద్ధికి ఎనలేని ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.