: విలన్ పాత్రల్లో నటిస్తా.. నాలోని నటిని బయటపెట్టాలనుంది!: బాలీవుడ్ భామ జాక్వెలిన్
చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు తమ రూటు మార్చుకోవాలనుకుంటున్నారు. ఎప్పుడూ హీరో పక్కన అందాల భామగా నిలబడి, పాటలు పాడుతూ, డ్యాన్సులు చేస్తే ఏం బాగుంటుంది? అని అనుకుంటున్నారో ఏమో, విలన్ పాత్రలపై మక్కువ చూపుతున్నారు. రొటీన్‌కి భిన్నంగా కనపడాలని అనుకుంటున్నారు. ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హాలీవుడ్ చిత్రం ‘బేవాచ్’లో నెగిటివ్ పాత్రలో నటించే అవకాశం కొట్టేసిన విషయం తెలిసిందే. అనంతరం మరో బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ కూడా విలన్ పాత్రలో నటిస్తానని పేర్కొంది. తాజాగా ‘హౌస్‌ఫుల్-3’, ‘డిషూం’ చిత్రాలతో విజయాలను అందుకున్న బాలీవుడ్ భామ, శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా అదే నిర్ణయం తీసుకుంది. తాను తాజాగా నటించిన సూపర్‌హీరో మూవీ ‘ఫ్లైయింగ్ జాట్’ ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. ఇలాంటి ఫాంటసీ చిత్రాల్లో ఎంత అసాధ్యమైన వాటినైనా సుసాధ్యంగా చేయవచ్చని పేర్కొంది. అందుకే తనకు ఇలాంటి సూపర్‌హీరో మూవీల్లో నటించడమంటే ఎంతో ఇష్టమని చెప్పింది. బాలీవుడ్ లో ఈ ఏడాది తాను పక్కింటి అమ్మాయిగా, గ్లామర్ పాత్రల్లోనే నటించినట్లు పేర్కొంది. కానీ ప్రస్తుతం తనకు రొటీన్‌కి భిన్నమైన పాత్రల్లో నటించాలని ఉన్నట్లు తెలిపింది. నెగిటివ్ పాత్రల్లో నటించాలని ఆశగా వుందని, అలాంటి పాత్రలతో తనలోని నటిని బయటపెట్టాలని ఉన్నట్లు చెప్పింది.