: ఇక భారత్-పాక్ మధ్య విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలు లేనట్టే!


భారత్-పాక్ మధ్య విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలు ఇప్పట్లో జరిగే అవకాశం కనిపించడం లేదు. ఉగ్రవాదంపై చర్చలకు పాక్ వెనకడుగు వేయడమే ఇందుకు కారణం. ‘మాట్లాడుకుందాం’ రమ్మంటూ భారత్‌ను ఆహ్వానించిన పాక్.. తన ప్రధాన అజెండా కశ్మీరేనని చెబుతోంది. అది తప్ప మరి దేనిమీదనైనా మాట్లాడుకుందామంటూ భారత్ తేల్చిచెప్పింది. దీంతో చర్చలు సందిగ్ధంగా మారాయి. కశ్మీర్‌లో నెలరోజులుగా నెలకొన్న కల్లోలంపై చర్చించేందుకు ఇస్లామాబాద్ రావాల్సిందిగా భారత విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్‌ను శుక్రవారం పాక్ మరోమారు ఆహ్వానించింది. కశ్మీర్‌లో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనకు పుల్‌స్టాప్ పెట్టాలని, అల్లర్లలో గాయపడిన కశ్మీరీలకు వైద్యం సాయం అందించేందుకు పాక్ డాక్టర్లను అనుమతించాలని పాక్ కోరుతోంది. గత సోమవారం కూడా ఈ విషయంలో చర్చిద్దాం రమ్మంటూ పాక్ ఆహ్వానించింది. అయితే కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని పేర్కొన్న భారత్ సీమాంతర ఉగ్రవాదం, భారత్‌లో ఉగ్రదాడులు, పాక్‌లో యథేచ్ఛగా తిరుగుతున్న ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవడం, చొరబాట్లు వంటివాటిపై మాత్రమే చర్చలు ఉంటాయని తేల్చి చెప్పింది. ముఖ్యంగా కశ్మీర్‌లో జరుగుతున్న అల్లర్లలో పాక్ పాత్రను చర్చల్లో లేవెనెత్తాలని భారత్ భావించింది. అయితే ఉగ్రవాదం ఊసెత్తగానే చర్చల విషయంలో పాక్ వెనక్కి తగ్గింది.

  • Loading...

More Telugu News