: ఏమాత్రం తగ్గని ప్రజాదరణ... గాంధీలను వెనక్కి నెట్టేసిన మోదీ


ప్రజాదరణలో గాంధీల కుటుంబాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వెనక్కి నెట్టేశారు. అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా మోదీనే నిలిచారు. 19 రాష్ట్రాల్లోని 97 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ‘ఇండియా టుడే’ ఒక సర్వే నిర్వహించింది. ఓటర్లలో అత్యంత ప్రజాదరణ పొందిన నేత ఎవరనే విషయమై ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరిట కార్వీ ఇన్ సైట్స్ భాగస్వామ్యంతో ఈ సర్వే నిర్వహించారు. ఇప్పటికిప్పుడు సాధారణ ఎన్నికలు నిర్వహిస్తే కనుక ఎన్డీఏకే ప్రజలు మళ్లీ పట్టం కడతారని ఆ సర్వేలో తేలింది. మోదీకి అనుకూలంగా 50 శాతం మంది ప్రజలు తమ మద్దతు తెలిపారు. మోదీతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి 13 శాతం తక్కువగా మద్దతు లభించింది. ఆ తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిలిచారు. ఎన్డీఏ సర్కార్ పై వస్తున్న ఆరోపణలు, వ్యతిరేకత వంటి అంశాలు ఎటువంటి ప్రభావం చూపలేకపోయానని ఈ సర్వే పేర్కొంది. ఉన్నపళంగా ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే ఎన్డీఏ 304 స్థానాల్లో విజయం సాధిస్తుందని, ఎన్డీఏకు చెందిన నాయకులే అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆ సర్వే చెప్పింది. ‘బెస్ట్ పీఎం’ ఎవరనే విషయమై ఆయా రాష్ట్రాల ఓటర్లను ప్రశ్నించగా, మొదటి స్థానంలో ఇందిరాగాంధీ, ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా అటల్ బిహారి వాజ్ పేయి, నరేంద్ర మోదీ నిలిచారు. ప్రజాదరణ గల ముఖ్యమంత్రుల్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిలిచారు.

  • Loading...

More Telugu News