: మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు: ‘ఎస్సై రామకృష్ణారెడ్డి ఆత్మహత్య’ విచారణాధికారి
మెదక్ జిల్లా కుకునూరుపల్లిలో ఇటీవల ఎస్ఐ రామకృష్ణారెడ్డి (45) ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పోలీస్ క్వార్టర్స్‌లో తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. ఉన్నతాధికారుల వేధింపులు తాళలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు పోలీసులకు క్వార్టర్స్‌లో సూసైడ్ నోట్ కూడా దొరికింది. అయితే, రామకృష్ణారెడ్డి ఆత్మహత్యపై విచారణ చేపట్టిన అధికారి ప్రతాప్‌రెడ్డి ఈరోజు మీడియాకు పలు విషయాలు వెల్లడించారు. రామకృష్ణారెడ్డి ఆర్మీ నుంచి వచ్చి పోలీస్ విభాగంలో చేరారని, కానీ ఆయన ఈ విభాగంలో ఇమడలేకపోయారని ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. రామకృష్ణారెడ్డికి చదువు కూడా అంతంత మాత్రమే కావడంతో తన విధి నిర్వహణలో ఇబ్బంది పడ్డారని ఆయన పేర్కొన్నారు. వాటికి తోడు ఎస్సైకి కుటుంబ సమస్యలు కూడా ఉన్నాయని తెలిపారు. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు.