: ఇదొక వైచిత్రి... అసిస్టెంట్ టీచర్ పోస్టుల కోసం మహాత్మాగాంధీ, అమితాబ్ బచ్చన్ దరఖాస్తు!
అవును.. అసిస్టెంట్ టీచర్ పోస్టుల కోసం ఉత్తరప్రదేశ్ విద్యాశాఖకు దరఖాస్తు చేసుకున్న వారిలో మహాత్మాగాంధీ, అమితాబ్ బచ్చన్ సహా పలువురు ప్రముఖులు ఉన్నారు. నమ్మశక్యం కాకున్నా ఇది నిజం. ఇంకో నమ్మలేని నిజం ఏంటంటే, గాంధీ 94 శాతం మార్కులతో మెరిట్ జాబితాలో టాప్‌లో ఉండడం! యూపీ ప్రభుత్వం ఇటీవల 16,448 అసిస్టెంట్ టీచర్ పోస్టుల కోసం బేసిక్ టీచింగ్ సర్టిఫికెట్ ఉన్న వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. ఉద్యోగార్థులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. లక్నోలో 33 పోస్టులు ఉంటే ఏకంగా 800 మంది దరఖాస్తు చేసుకున్నారు. మెరిట్ జాబితా తయారుచేస్తున్న అధికారులు మహాత్మాగాంధీ, అమితాబ్ బచ్చన్ సహా పలువురు ప్రముఖుల పేర్లతో ఉన్న 15 దరఖాస్తులు చూసి అవాక్కయ్యారు. మొదట ఆశ్చర్యపోయిన వారు బాగా ఆలోచించి మెరిట్ లిస్ట్‌లో ఆయా దరఖాస్తులను కూడా చేర్చాలని నిర్ణయించారు. వారు రూపొందించిన మెరిట్ జాబితాలో 94 శాతం మార్కులతో గాంధీకి తొలి స్థానం దక్కింది. అయితే రెండో ర్యాంకర్ అయిన అర్షాద్ ఇంటిపేరు రాయాల్సిన చోట నిర్లక్ష్యంగా రాయడం, చాలామంది ఇంటిపేర్లను ప్రస్తావించకపోవడంతో అవన్నీ నకిలీ అప్లికేషన్లని తర్వాత అధికారులు ధ్రువీకరించారు. ఆన్‌లైన్ దరఖాస్తు విధానాన్ని అవకాశంగా తీసుకుని అధికారుల్లో అయోమయం సృష్టించేందుకే అభ్యర్థులు ఇలా చేసి ఉంటారని విద్యాశాఖాధికారి ప్రవీణ్ మణి త్రిపాఠి తెలిపారు.