: శ్రీశైలం జలాశయంలో 873.9 అడుగులకు తగ్గిన నీటిమట్టం!
ఈ ఏడాది శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టంతో కళకళలాడుతుందన్న ఆశలు అడియాశలే అయ్యాయి. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలతో పోటెత్తిన వరద నీటితో జలాశయంలో మొన్నటిదాకా నీటి మట్టం వడివడిగా పెరిగింది. అయితే రెండు రోజుల నుంచి జలాశయానికి వస్తున్న ఇన్ ఫ్లో భారీగా పడిపోయింది. అదే సమయంలో కృష్ణా పుష్కరాల కోసం జలాశయం నుంచి పెద్ద ఎత్తున నీటిని విడుదల చేయక తప్పని పరిస్థితి. వెరసి జలాశయంలో నీటి మట్టం పెరగడం ఆగిపోవడమే కాకుండా క్రమంగా తగ్గుతోంది. నేటి ఉదయం 7 గంటల సమయానికి జలాశయంలో 873.9 అడుగుల నీటి మట్టం ఉంది. నిన్న ఉదయం 8 గంటల సమయానికి ఈ నీటి మట్టం 874.2 అడుగులుగా నమోదైన విషయం తెలిసిందే. ప్రస్తుతం జలాశయానికి 16 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, 42,740 క్యూసెక్కుల నీటిని అధికారులు కిందకు వదులుతున్నారు. ఫలితంగా నిన్న 874.2 అడుగులుగా నమోదైన నీటి మట్టం 873.9 అడుగులకు పడిపోయింది. ప్రస్తుతం జలాశయంలో 158.63 టీఎంసీల నీరు ఉంది. నిన్న ఉదయం 159.77 టీఎంసీల నీరు ఉన్న సంగతి తెలిసిందే.