: ఆవులను తరలిస్తున్నాడని బీజేపీ కార్యకర్తను కొట్టి చంపిన వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ శ్రేణులు
తాము పవిత్రంగా కొలుచుకునే ఆవులను కబేళాలకు తరలిస్తున్నారంటూ, వాటి మాంసాన్ని విక్రయిస్తున్నారంటూ దేశంలోని పలు రాష్ట్రాల్లో దళితులపై దాడులు జరుగుతోన్న ఘటనలు వెలుగులోకొస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా కర్ణాటకలోని ఉడిపిలో కూడా ఇటువంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. అయితే, ఈసారి ఇదే ఆరోపణలపై ప్రవీణ్ పూజారి అనే బీజేపీ కార్యకర్తను విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ), బజరంగ్ దళ్ శ్రేణులు తీవ్రంగా కొట్టడంతో అతను చనిపోయాడు. రెండు ఆవులను టెంపో వాహనంలో ఆయన తన స్నేహితుడితో కలిసి తరలిస్తుండగా వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ కంటపడింది. దీంతో దాదాపు 20 మంది ప్రవీణ్‌పై దారుణంగా దాడికి దిగారు. వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ కార్యకర్తల వద్ద ఆయుధాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడిలో తీవ్రంగా దెబ్బలు తగలడంతో ప్రవీణ్ పూజారి మృతి చెందాడని ఉడిపి ఎస్పీ కేపీ బాలకృష్ణన్ పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న తాము ఇప్పటికే 17 మందిని అదుపులోకి తీసుకున్నామని వివరించారు.