: నయీమ్ తో నాకు సంబంధాల్లేవు!... తేల్చిచెప్పిన కర్నూలు జిల్లా టీడీపీ నేత!


తెలంగాణ పోలీసుల చేతిలో హతమైన గ్యాంగ్ స్టర్ నయీమ్ తో పలువురు పోలీసు అధికారులకు సంబంధాలున్నాయంటూ వస్తున్న వార్తలు తెలుగు రాష్ట్రాలకు చెందిన పోలీసు శాఖల్లో పెను కలకలమే రేపుతున్నాయి. మొన్నటికి మొన్న ఉమ్మడి రాష్ట్రానికి మాజీ డీజీపీగా పనిచేసిన వి.దినేశ్ రెడ్డి నేరుగా మీడియా ముందుకు వచ్చారు. తనతో పాటు ఏ ఒక్క మాజీ డీజీపీకి నయీమ్ తో సంబంధాలు లేవని ఆయన తెలిపారు. తాజాగా ఉమ్మడి రాష్ట్రంలో నాన్ కేడర్ ఎస్పీగా పనిచేసి ఆ తర్వాత రాజకీయ తెరంగేట్రం చేసిన టీడీపీ నేత, కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ ఇన్ చార్జీ శివానందరెడ్డి నిన్న మీడియా ముందుకు వచ్చారు. హైదరాబాదు సోమాజీగూడ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిజానిజాలు తెలుసుకోకుండా వార్తలు ప్రచురించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్-1 అధికారిగా ఎన్నికైన తాను 2000 నుంచి మూడేళ్ల పాటు నల్లగొండ జిల్లాలో అదనపు ఎస్పీగా పనిచేసిన మాట వాస్తవమేనని శివానందరెడ్డి పేర్కొన్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారులు శివధర్ రెడ్డి, వీసీ సజ్జన్నార్ లు ఎస్పీలుగా పనిచేసిన ఆ కాలంలో నయీమ్ పేరు ఎక్కడా వినిపించలేదన్నారు. నక్సలైట్ల సమాచారం కోసం మాజీ నక్సల్స్ సహాయం తీసుకోవడం పోలీసు శాఖలో సర్వసాధారణమని ఆయన చెప్పారు. పోలీసు శాఖలోని ఒకటి, రెండు శాతం మంది నయీమ్ లాంటి వ్యక్తులతో అంటకాగినంతమాత్రాన... అందరికీ ఆ పాపాన్ని అంటగట్టడాన్ని మీడియా ఇకనైనా మానుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News