: జీఎస్టీ బిల్లు ఆమోదంపై నిర్ణయం తీసుకున్నాం.. త్వరలోనే తెలంగాణ అసెంబ్లీ సమావేశం: ఈటల రాజేందర్


ఇటీవ‌లే రాజ్య‌స‌భతో పాటు లోక్‌స‌భ‌లోనూ వ‌స్తు, సేవ‌ల ప‌న్ను (జీఎస్‌టీ) స‌వ‌ర‌ణ‌ బిల్లు ఆమోదం పొందిన సంగ‌తి తెలిసిందే. కేంద్రం వ‌చ్చే ఆర్థిక సంవత్స‌రం నుంచి అమ‌లులోకి తీసుకురావాల‌ని చూస్తోన్న ఈ బిల్లుకి ప‌లు రాష్ట్రాల నుంచి సానుకూల స్పంద‌న వచ్చింది. ఇప్ప‌టికే ఈ బిల్లుకి అసోం శాసనసభ ఆమోదం తెలిపి జీఎస్‌టీ బిల్లును ఆమోదించిన మొద‌టి రాష్ట్రంగా అసోం నిలిస్తే, బీహార్ కూడా ఆమోదం తెలిపి ఈ బిల్లుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తొలి ఎన్డీయేత‌ర పాలిత రాష్ట్రంగా నిలిచింది. ఇప్పుడు తెలంగాణ శాస‌న‌స‌భ జీఎస్‌టీ స‌వ‌ర‌ణ‌ బిల్లుకి ఆమోదం తెల‌ప‌డానికి సన్నాహాలు చేసుకుంటోంది. బిల్లు ఆమోదం కోసం తెలంగాణ అసెంబ్లీ త్వరలోనే స‌మావేశం కానుంది. ఈ నెలలోనే రాష్ట్ర అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేయన్నారు. ఈ విష‌యాన్ని తెలంగాణ‌ రాష్ట్ర ఆర్థిక శాఖ‌ మంత్రి ఈటల రాజేందర్ మీడియాకు తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ అంశంపై ఇప్ప‌టికే చర్చించార‌ని చెప్పారు. సాధ్యమైనంత త్వరలోనే శాస‌న‌స‌భ‌ సమావేశానికి పిలుపునిచ్చి దానిలో జీఎస్‌టీ బిల్లు ఆమోదానికి పెట్ట‌నున్న‌ట్లు పేర్కొన్నారు. బిల్లుకి పార్లమెంటులో త‌మ‌పార్టీ ఎంపీలు మద్దతు తెలిపార‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌ధాని మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా కూడా బిల్లు ఆమోదంపై కేసీఆర్ హామీ ఇచ్చారని ఆయ‌న తెలిపారు.

  • Loading...

More Telugu News