: పరీక్షల నుంచి డీబార్ చేశారని విద్యార్థి ఆత్మహత్య... ఢిల్లీ న్యాయ కళాశాలలో ఉద్రిక్తత
కళాశాలకు అధికంగా గైర్హాజరు అయ్యాడన్న కారణాన్ని చూపుతూ నోయిడాలోని అమిటీ లా స్కూల్, రోహిళ్ల సుశాంత్ (21) అనే విద్యార్థిని డీబార్ చేయగా, మనస్తాపంతో అతను ఆత్మహత్య చేసుకున్న ఘటనపై విద్యార్థిలోకం భగ్గుమంది. వందలాది మంది విద్యార్థులు, పూర్వ విద్యార్థులు స్కూల్ యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ ఆందోళనకు దిగడంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. గురు గోవింద్ ఇంద్రప్రస్థ యూనివర్శిటీకి అనుబంధంగా పనిచేస్తున్న ఈ న్యాయ కళాశాలలో 70 శాతానికి మించిన హాజరుంటేనే పరీక్షలకు అనుమతిస్తారు. అయితే, సుశాంత్ కు హాజరు చాలకపోవడంతో పరీక్షలకు అనుమతించ లేదు. తనను డీబార్ చేయవద్దని కాలేజ్ వ్యవస్థాపకుడు డాక్టర్ అశోక్ చౌహాన్ తో ఎంతగా మొరపెట్టుకున్నా అతని మాట వినలేదు. "నా అన్న ఎంతగా ప్రాధేయపడినా కాలేజీ నిర్వాహకులు వినలేదు. ఆయన మరణించిన తరువాత, మాకెన్నో యాజమాన్యం వేధింపులపై ఎన్నో కాల్స్, మెసేజ్ లు వచ్చాయి. దీనిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా" అని సుశాంత్ సోదరి మేహక్ అన్నారు. కాగా, హాజరు చాలని కారణంగా మొత్తం 19 మందిని పరీక్షల నుంచి డీబార్ చేసినట్టు తెలుస్తోంది.