: జిమ్నాస్ట్ దీపపై ట్వీట్ల ఫలితం.. మహిళకు బెదిరింపు ట్వీట్లు


ఒలింపిక్స్‌లో తృటిలో పతకం చేజార్చుకున్న దీపాకర్మాకర్‌పై ఓ మహిళ చేసిన ట్వీట్లకు బెదిరింపులు, దూషణలతో కూడిన ట్వీట్లు వెల్లువెత్తాయి. దీంతో ఆమె విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే, కేంద్ర మంత్రి మేనకాగాంధీలకు ఈ విషయంపై ట్వీట్ చేసింది. దీంతో స్పందించిన పోలీసులు ఆన్‌లైన్‌లో మహిళను వేధించిన వ్యక్తులపై కేసు నమోదు చేశారు. దీపాకర్మార్ వాల్ట్‌ఫైనల్‌లో పాల్గొనడానికి ముందు తానెంతో సంఘర్షణ అనుభవించానని జైపూర్‌కు చెందిన 26 ఏళ్ల మహిళ వరుస ట్వీట్లు చేసింది. ‘‘ఇది చాలా గొప్ప విషయం. డెత్ వాల్ట్‌గా పేర్కొనే ఈ ఫీట్‌ను చేసేందుకు ధనిక దేశాలు కూడా ముందుకు రావడం లేదు. కానీ ఈరోజు ఆమె తన ప్రాణాలను పణంగా పెట్టబోతోంది. హేయమైన ఏ దేశం కోసమూ ప్రాణాలు పణంగా పెట్టకూడదు. ప్రాణం కంటే పతకం గొప్పది కాదు’’ అని ట్వీట్ చేసింది. దీంతో ఆమెకు అసభ్యకరమైన, బెదిరింపు ట్వీట్లు రావడం మొదలుపెట్టాయి. ఈ విషయాన్ని ఆమె మంత్రులు, ముఖ్యమంత్రి దృష్టికి ట్వీట్ల ద్వారా తీసుకెళ్లింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో కేసు నమోదు చేసినట్టు కమిషనర్ సంజయ అగర్వాల్ తెలిపారు. అయితే ఆమె ట్వీట్‌లో ‘హేయమైన’ పదం ఉపయోగించడంతో సదరు మహిళను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ‘‘పోలీసులు నన్ను విడిచిపెట్టారు. నిందితులపై కేసు నమోదు చేశారు. హేయమైన అనే పదం ఉపయోగించడంపై నన్ను ప్రశ్నించారు. అయితే అది మన దేశాన్ని ఉద్దేశించి పేర్కొనలేదని చెప్పడంతో వదిలిపెట్టారు’’ అని మరో ట్వీట్‌లో మహిళ పేర్కొంది.

  • Loading...

More Telugu News