: వెంకయ్య అందరికీ అన్నయ్యే!... తెలుగు నేతను ‘బడే భాయ్’గా సంబోధించిన రాజ్ నాథ్!
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు... ఆ పార్టీలోని నేతలందరికీ అన్నయ్యే. ఇదేదో మనకు మనం చెప్పుకుంటున్న విషయం ఎంతమాత్రం కాదు. కేంద్ర కేబినెట్ లో కీలక మంత్రులుగా ఉన్న రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీలాంటి కీలక నేతలు చెబుతున్న విషయమిది. ‘వెంకయ్య మాకు అన్నయ్యలాంటి వారు’ అంటూ పార్లమెంటు సాక్షిగా జైట్లీ చేసిన వ్యాఖ్యలు గతంలో ఆసక్తి రేకెత్తించాయి. తాజాగా నిన్న రాజ్ నాథ్ సింగ్ మరో అడుగు ముందుకేసి... వెంకయ్యను ‘పెద్దన్నయ్య’గా అభివర్ణించారు. ఏపీకి ప్రత్యేక హోదా, ఇతర విభజన హామీల అమలు కోసం రంగంలోకి దిగిన వెంకయ్య నిన్న రాజ్ నాథ్ ను కలిశారు. ఈ సందర్భంగా విభజన హామీల అమలు కోసం నోడల్ ఏజెన్సీగా ఉన్న కేంద్ర హోం శాఖే... మిగిలిన అన్ని శాఖలతో సంప్రదింపులు జరిపితే బాగుంటుందని రాజ్ నాథ్ ను కోరారు. దీనికి రాజ్ నాథ్ సింగ్ కూడా సానుకూలంగా స్పందించారు. అంతేకాకుండా.... 'మీరూ మాట్లాడండి' అంటూ వెంకయ్యకు రాజ్ నాథ్ సింగ్ సూచించారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘దానిదేముంది... మీరు కూడా అందరితో మాట్లాడవచ్చు. మీరు మా బడే భాయ్!’’ అని రాజ్ నాథ్ వ్యాఖ్యానించారు.