: బ్యాంకులు బాగుపడితేనే దేశం ముందుకు: రఘురాం రాజన్ కీలక సూచనలు


ప్రభుత్వ రంగ బ్యాంకులు బాగుపడితేనే దేశం ఆర్థిక వృద్ధిపరంగా పురోగమిస్తుందని ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ స్పష్టం చేశారు. ఎఫ్ఐసీసీఐ, ఐబీఏ సంయుక్తంగా నిర్వహించిన బ్యాంకింగ్ సెమినార్ లో పాల్గొన్న రాజన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పాలన మరింతగా మెరుగుపడాలని తెలిపారు. బ్యాంకుల్లో చైర్మన్, ఎండీ తదితర ఉన్నతోద్యోగులను, అనధికార డైరెక్టర్లను నియమించుకునే అధికారం బీబీబీ (బ్యాంక్ బోర్డ్ బ్యూరో)కే వదిలివేస్తూ, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి వుందని సూచించారు. ప్రస్తుతం చీఫ్ ఎగ్జిక్యూటివ్ నుంచి ఈడీలు, బోర్డు డైరెక్టర్లను కేంద్రమే నియమిస్తూ వస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఈ తరహా అలవాటు మారాలని అన్నారు. పాలనతో పాటు బ్యాంకు మేనేజ్ మెంట్ సంస్కరణల అమలు సమాంతరంగా జరగాల్సి వుందని అభిప్రాయపడ్డారు. దేశంలో బ్యాంకింగ్ సేవలందించేందుకు అనుమతులు పొందిన సంస్థలు మరో ఆరు నెలల్లో కార్యకలాపాలు ప్రారంభించనున్నాయని, అయితే, వీటి ముందు ఎన్నో సవాళ్లు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. ఈ కంపెనీల మధ్య నెలకొన్న పోటీ వాతావరణం కస్టమర్లకు అవకాశంగా మారి లబ్ధిని చేకూరుస్తుందని, వారికి మరింత పారదర్శకమైన, సులభతరమైన సేవలు అందుతాయన్నది తన నమ్మకమని అన్నారు.

  • Loading...

More Telugu News