: టీవీ9 స్టూడియో లైవ్ లో డాకూరి బాబు... అరెస్ట్ చేసి, తీసుకెళ్లిన పోలీసులు
రియల్ ఎస్టేట్ వివాదంలో శివరాజ్ యాదవ్ ను హత్య చేసి, ఆపై కాంగ్రెస్ నేత యాదగిరిపై కాల్పులు జరిపి, మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ తప్పించుకుని తిరుగుతున్న మహేశ్ అలియాస్ డాకూరి (డెక్కల) బాబును ఈ ఉదయం నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు అరెస్ట్ చేశారు. తాను మీడియా ముందు లొంగిపోతానని చెబుతూ, డాకూరి బాబు టీవీ 9 స్టూడియోకు వచ్చి, లైవ్ ఇంటర్వ్యూ ఇస్తుండగా, విషయం తెలుసుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి తీసుకు వెళ్లారు. దీంతో లైవ్ కార్యక్రమం మధ్యలోనే ఆగింది. అంతకుముందు ఇంటర్వ్యూలో, యూపీలో తుపాకులు చాలా సులువుగా దొరుకుతాయని, తాను అక్కడి నుంచే తుపాకులు తెచ్చానని చెప్పాడు. తాను ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నానని, యాదగిరిని చంపాలన్న ఉద్దేశం లేదని, బెదిరించాలనే అలా చేశానని చెప్పుకొచ్చాడు. తనకు నేర చరిత్ర లేదని బుకాయించాడు. కాగా, డాకూరి బాబును టాస్క్ ఫోర్స్ ఆఫీసుకు తరలించిన పోలీసులు కేసు విచారణను ఇక వేగవంతమవుతుందని తెలిపారు.