: పుష్కరాల్లో సినీ ఫక్కీలో చోరీ.. రూ.50 ఎరవేసి మూడు లక్షల విలువైన బంగారు నగలు చోరీ
పవిత్ర పుష్కరాల్లో దొంగలు హల్చల్ చేస్తున్నారు. కృష్ణలో మునకేసి పాపాలను పోగొట్టుకోవాలనుకుంటున్న భక్తులను దొంగలు నిలువునా దోచేస్తున్నారు. వారి దృష్టి మరల్చి అందినకాడికి దోచుకుపోతున్నారు. తాజాగా సోమవారం విజయవాడ పవిత్ర సంగమం ఘాట్‌లో సినీ ఫక్కీలో జరిగిన దొంగతనం పోలీసులను సైతం అవాక్కయ్యేలా చేసింది. తిరువూరు రాజుపేటకు చెందిన రామిశెట్టి కుటుంబ సభ్యులతో కలిసి పితృ దేవతలకు పిండ ప్రదానం కోసం సంగమం ఘాట్‌కు చేరుకున్నారు. స్నానానంతరం పిండ ప్రదానం చేసే కార్యక్రమం ఉండడంతో నెక్లెస్, గొలుసు, ఉంగరాలు ఇతర ఆభరణాలను తీసి ఓ బ్యాగులో పెట్టి సత్యనారాయణ కుమార్తెకు(15) ఇచ్చి జాగ్రత్తగా పట్టుకోమని చెప్పారు. అక్కడే కాపుకాసిన దొంగ ఈ మొత్తం తతంగాన్ని ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్తగా గమనించాడు. వారు కార్యక్రమంలో ఉండగా అమ్మాయి దగ్గరికి వచ్చిన దొంగ రూ.50 నోటు తీసి కిందపడేశాడు. తర్వాత ఆమె వద్దకు వెళ్లి మీ డబ్బులు కిందపడిపోయాయని చెప్పాడు. ఆమె తీసుకునే ప్రయత్నంలో ఉండగా చేతిలో సంచి లాక్కుని పరారయ్యాడు. బాధితులు తేరుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో లబోదిబోమంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తమకు పురోహితుడిపైనే అనుమానం ఉందని ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.