: చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల నుంచి నాకు ప్రాణ హాని ఉంది: ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉదయ్ కిరణ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేరంగుల ఉదయ్‌కిరణ్ ఆరోపించారు. తనకేదైనా జరిగితే వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. వారిద్దరినీ విమర్శిస్తూ తాను ఇటీవల వ్యాఖ్యలు చేశానని, దీంతో తన కుమార్తెను కిడ్నాప్ చేసేందుకు కొందరు దుండగులు ప్రయత్నించారని పేర్కొన్నారు. తనకు వారిద్దరి నుంచి ప్రమాదం పొంచి ఉందని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సెంట్రల్ హోం సెక్రటరీకి ఫిర్యాదు చేశానని, అయినా ఫలితం లేకుండా పోయిందన్నారు. కేంద్ర, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లలో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదన్నారు. పోలీసులు తప్పుడు నివేదిక ఇవ్వడమే ఇందుకు కారణమన్నారు. చివరికి హైకోర్టును ఆశ్రయించానని, ఈనెల 22లోపు వివరణ ఇవ్వాల్సిందిగా ఏపీ డీజీపీని కోర్టు ఆదేశించిందన్నారు.