: 'మేడమ్' అని పిలిచినందుకు యువకుడిపై దాడి!
మహిళలను పిలిచేందుకు గౌరవ సూచకంగా సంబోధించే 'మేడమ్' పదం ప్రేమ్ ప్రసాద్ అనే వ్యక్తిని చితక్కొట్టేలా చేసింది. బీహార్ లోని అటారీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మార్కెట్ కు ప్రేమ్ ప్రసాద్ అనే వ్యక్తి పండ్లు కొనుక్కునేందుకు వెళ్లాడు. అక్కడ పళ్లమ్ముతున్న మహిళనుద్దేశించి... 'మేడమ్ ఈ పండ్లెంత?' అని అడిగాడు. అంతే, ఆమెలో కోపం కట్టలు తెంచుకుంది. అతనిని పట్టుకుని దులిపేసింది. అంతటితో ఆగని ఆమె చుట్టుపక్కలున్న బంధువులను పిలిచి నానాయాగీ చేసింది. దీంతో వారు ప్రేమ్ ప్రసాద్ పై దాడికి దిగారు. తాను దురుద్దేశంతో మాట్లాడలేదని, తప్పుగా అనిపిస్తే క్షమించాలని కోరినా వారు శాంతించలేదు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితుడ్ని ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చేపట్టారు.