: 2050 నాటికి ఏపీ ప్రపంచంలోనే అత్యుత్తమం: చంద్రబాబు


2050 నాటికి ప్రపంచ స్థాయి నాణ్యత, సౌకర్యాలతో కూడిన రాజధాని నగరంతో పాటు, అత్యుత్తమ రాష్ట్రంగా ఏపీని నిలిపేందుకు దీర్ఘకాల ప్రణాళికలతో అభివృద్ధి దిశగా అడుగులు వేయనున్నట్టు సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఆగస్టు 15 వేడుకల సందర్భంగా అనంతపురంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు మ్యానిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలనూ నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఎన్ని కష్టాలున్నా వాటికి ఎదురు నిలిచి రెండంకెల అభివృద్ధిని సాధించామని గుర్తు చేశారు. గత సంవత్సరం ఇండియా 7.5 శాతం వృద్ధిని నమోదు చేసిన వేళ, ఏపీలో 10.99 శాతం వృద్ధిని సాధించి, ఇండియాలోనే మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నానని తెలిపారు. గత సంవత్సరం వ్యాపారానికి అనుకూలమైన రాష్ట్రాల్లో గుజరాత్ తరువాత ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచిందని చంద్రబాబు వివరించారు. పెట్టుబడుల ఆకర్షణలో మూడో స్థానంలో, ఉపాధి హామీ అమలులో అగ్రస్థానంలో ఉన్నామని, విద్యుత్ రంగంలో కేంద్రం ఇచ్చే అన్ని అవార్డులనూ అందుకున్నామని తెలిపారు. ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన హిందూపురం నుంచి తాను పాదయాత్ర చేపట్టి 2,901 కి.మీల దూరాన్ని 200 రోజులకు పైగా చుట్టి వచ్చి, పేదలు, రైతుల సమస్యలను దగ్గర నుంచి పరిశీలించానని, దాన్ని జీవితంలో మరచిపోనని పేర్కొన్నారు. రైతులను అప్పుల ఊబి నుంచి బయట పడేయాలని ఆనాడే అనుకుని, రుణ మాఫీని ప్రకటించి, దాన్ని చేసి చూపించానని అన్నారు. పేదలకు సంక్షేమాన్ని దగ్గర చేశామని చెప్పారు.

  • Loading...

More Telugu News