: 108 పరుగులకే చాప చుట్టేసిన విండీస్... ఇండియాకు సిరీస్
వెస్టిండీస్ తో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్ లో మూడో టెస్టు ముగిసేసరికి 2-0 తేడాతో భారత జట్టు సిరీస్ ను కైవసం చేసుకుంది. మూడో టెస్టు ఐదో రోజున బ్రావో (59) మినహా మరెవరూ రాణించలేక పోవడంతో విండీస్ జట్టు 108 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు బ్రాత్ వైట్ 4, జాన్సన్ 0 పరుగులకే పెవీలియన్ దారిపట్టగా, శామ్యూల్స్ 12, చేజ్ 10, బ్లాక్ వుడ్ 1, డౌరిచ్ 5, హోల్డర్ 1, జోసఫ్ 0, కుమిన్స్ 2, గాబ్రియేల్ 11 పరుగులు మాత్రమే చేయగలిగారు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ 3 వికెట్లు తీసుకోగా, ఇశాంత్ శర్మ, జడేజాలకు చెరో 2 వికెట్లు లభించాయి. ఈ గ్రాస్ ఇస్లెట్ లో జరిగిన ఈ మ్యాచ్ లో భారత జట్టు 237 పరుగుల తేడాతో విజయంతో పాటు సిరీస్ నూ గెలుచుకోగా, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు రవిచంద్రన్ అశ్విన్ కు దక్కింది. అనిల్ కుంబ్లే కోచ్ గా అవతరించిన తరువాత తొలి పర్యటనలోనే సిరీస్ విజయాన్ని భారత జట్టు సొంతం చేసుకోవడం గమనార్హం.