: నయీమ్ లాంటి అంతర్జాతీయ స్థాయి గ్యాంగ్ స్టర్ ను తయారు చేసిన ఘనత పోలీసులదే!: దినేష్ రెడ్డి
తాను డీజీపీగా ఉండగా పలు హత్యా నేరాల్లో నిందితుడుగా ఉన్న నయీమ్ ను పట్టుకోవాలని ఏవోబీ పోలీసులకు లేఖ రాశానని ఆయన చెప్పారు. ఓ టీవీ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, అండర్ గ్రౌండ్ లో ఉన్న నేరస్థుడ్ని పట్టుకునేందుకు అవసరమైన సామగ్రి ఏవోబీ పోలీసులు లేదా ఇంటెలిజెన్స్ పోలీసుల వద్దే ఉండేవని అన్నారు. దీంతో తాను కమిషనర్ గా ఉండగా ఏమీ చేయలేకపోయానని అన్నారు. అయితే డీజీపీగా ఉండగా, నయీమ్ ను పట్టుకోవాలని ఏవోబీ పోలీసులకు లేఖ రాశానని ఆయన చెప్పారు. అయితే, నయీమ్ అప్పట్లో నక్సలైట్లకు సంబంధించిన కీలక సమాచారం ఇస్తుండడంతో ఏవోబీ అధికారులు నేరుగా సీఎంను కలిసి అతనిని పట్టుకుంటే పోలీసు శాఖకే నష్టమని సూచించి ఉండవచ్చని అన్నారు. అందువల్లే నక్సలైట్ల నుంచి సమాచారం తీసుకోగలిగిన ఏవోబీ పోలీసులు, నయీమ్ అండర్ గ్రౌండ్ లో ఉన్నాడని, అతనిని పట్టుకోవడం సాధ్యం కాలేదని రిపోర్టులిచ్చారని ఆయన చెప్పారు. ఏది ఏమైనా, నయీమ్ లాంటి అంతర్జాతీయ స్థాయి గ్యాంగ్ స్టర్ ను తయారు చేసిన ఘనత పోలీసు శాఖకే చెందుతుందని ఆయన స్పష్టం చేశారు. నయీమ్ అంశంలో అప్పట్లో జరిగిన విచారణకు సంబంధించిన సున్నితమైన, కీలకమైన అంశాలను ఇప్పుడు ఉన్నతాధికారులకు అందిస్తానని ఆయన చెప్పారు.