: మోసం చేసిన కంపెనీలకు ఎరువుల సబ్సిడీ నిలిపేయండి: మంత్రి ప్రత్తిపాటి ఆదేశాలు
మోసం చేసిన కంపెనీలకు ఎరువుల సబ్సిడీ నిలిపేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అధికారులను ఆదేశించారు. కొన్ని కంపెనీల ఎరువుల బస్తాల్లో తూకం సమస్యలొచ్చాయని ఆయన పేర్కొన్నారు. బస్తాల్లో తూకం సరిపడినంత ఉండడం లేదని అన్నారు. ఇటువంటి వాటిపై 3 జిల్లాల్లో ఇప్పటివరకు 15 కేసులు నమోదయ్యాయని వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. కృష్ణా పుష్కరాలను తమ ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహిస్తోందని ప్రత్తిపాటి పేర్కొన్నారు. భక్తులు ప్రభుత్వ ఏర్పాట్లపై హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అయితే, ప్రజలు ప్రభుత్వాన్ని మెచ్చుకుంటే వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి సహించలేరని ఆయన వ్యాఖ్యానించారు. పుష్కరాల ఏర్పాట్లపై కిందిస్థాయి ఉద్యోగులందరూ కష్టపడుతున్నారని, అటువంటప్పుడు సిబ్బంది స్థైర్యాన్ని దెబ్బతీసేలా జగన్ విమర్శలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.