: ముషీరాబాద్ గవర్నమెంట్ స్కూల్ లో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్... విద్యార్థులతో సంభాషణ
హైదరాబాదు, ముషీరాబాద్ లోని గవర్నమెంట్ హైస్కూల్ లో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ సందడి చేశారు. ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాలకు విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరితో కలిసి వెళ్లిన ఆయన స్కూలు విద్యార్థులతో ముచ్చటించారు. వారి విద్యాభ్యాసం ఎలా సాగుతుందో వారినే అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులను ప్రశ్నలు అడిగారు. విద్యార్థులడిగిన ప్రశ్నలకు ఆయన ఓపిగ్గా సమాధానం చెప్పారు. దేశ రక్షణ రంగానికి కేంద్ర ప్రభుత్వం ఎంత ప్రాముఖ్యతనిస్తోందో అంతే ప్రాముఖ్యత విద్యారంగానికి కూడా ఇస్తోందని ఆయన తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకుని, మంచి పౌరులుగా ఎదగాలని ఆయన సూచించారు. అందరికీ నాణ్యమైన విద్య అందించడమే మోదీ లక్ష్యమని ఆయన తెలిపారు. విద్యార్థుల్లో చదవు పట్ల జిజ్ఞాస పెంచేలా బోధించాలని ఆయన ఉపాధ్యాయులకు సూచించారు.