: అమెరికా గాయపడ్డ దేశం... ఆ చర్యను తప్పుబట్టలేం: షారూక్ నిర్బంధంపై కమల్ హాసన్ విభిన్న స్పందన
'ఖాన్' అన్న పదం అమెరికాలోకి ప్రవేశ నిషేదాన్ని ఎదుర్కొంటున్న పేరుగా ఉండటంతో, బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ ఎప్పుడు అమెరికా వెళ్లినా ఆయనకు ఇబ్బందులు తప్పడం లేదు. తాజాగా, లాస్ ఏంజిల్స్ విమానాశ్రయంలో దిగిన వేళ, షారూక్ ను నాలుగు గంటల పాటు ఇమిగ్రేషన్ అధికారులు నిర్బంధించిన వేళ, విషయం తెలుసుకున్న ఎంతో మంది ఆయనకు బాసటగా నిలిచి, అమెరికా అధికారుల వైఖరిని తప్పుబట్టిన వేళ, విలక్షణ నటుడు కమల్ హాసన్ విభిన్నంగా స్పందించాడు. ఓ గాయపడిన దేశంగా, తన జాగ్రత్తలు తాను తీసుకుంటున్న అమెరికాను తప్పుబట్టలేమని కమల్ అన్నాడు. "ఈ ఘటనపై అతిగా స్పందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఈ ఖాన్... షారూక్ ఖాన్ కాబట్టి. షారూక్ సైతం తనను నిర్బంధించడాన్ని మనసులో పెట్టుకుంటాడని భావించడం లేదు. తాను షారూక్ ఖాన్ కాబట్టి, తనను ప్రత్యేకంగా చూడాలని ఆయన కోరుకుంటున్నాడని నేను అనుకోవడం లేదు. ఇదే తరహా ఘటన నాకూ ఎదురైంది. నా విమానం మిస్ అయింది కూడా. నాకెవరూ క్షమాపణలు చెప్పలేదు. వారు వారి రూల్స్ పాటిస్తున్నారంతే" అని అన్నాడు. పేరును బట్టి తనను ఓ ముస్లింగా భావించి విచారిస్తుంటారని, తన సోదరులు చారు హాసన్, చంద్ర హాసన్ లకు మాత్రం ఈ పరిస్థితి ఎదురు కాలేదని చెప్పాడు.