: గోదావరి స్థాయిలో కృష్ణా పుష్కరానికి రాని భక్తులు... కారణం చెప్పిన చంద్రబాబు
గురుడు కన్యారాశిలో ప్రవేశించిన వేళ, తెలుగింటి అలివేణి కృష్ణమ్మ పుష్కర సంబరాలకు ఇసుకేస్తే రాలనంత జనం ఎక్కడా కనిపించలేదు. గోదావరి పుష్కరాలతో పోల్చి చూస్తే, దాదాపు అన్ని ఘాట్లలో జనాభా తక్కువగానే ఉంది. ఇక ఇదే విషయాన్ని విజయవాడ దుర్గా ఘాట్ లో ప్రస్తావించిన ఏపీ సీఎం చంద్రబాబు అందుకు కారణాలు కూడా చెప్పారు. నేడు శ్రావణ శుక్రవారం కారణంగా మహిళలంతా ఇళ్లలోనే అమ్మవారి పూజలు తలపెట్టారని, అందువల్లే తొలి రోజు భక్తుల రద్దీ తక్కువగా ఉందని అన్నారు. రేపటి నుంచి భక్తుల రద్దీ పెరుగుతుందని తెలిపారు. ఈ పుష్కరాల సందర్భంగా పవిత్ర సంకల్పం చేసుకున్నామని, ప్రశాంతంగా పుష్కరాలు ప్రారంభమయ్యాయని వివరించారు. ప్రయాణికుల భద్రత, సౌకర్యం దృష్ట్యా బస్సుల రద్దీని రియల్ టైమ్ మానిటరింగ్ విధానంలో నియంత్రిస్తున్నామని చంద్రబాబు తెలిపారు.