: సౌదీలో ఉద్యోగాలు కోల్పోయినవారిలో 26 మంది భారతీయులు స్వదేశానికి
సౌదీలో వందలాది మంది భారతీయులు ఉద్యోగాలు కోల్పోయి తినడానికి తిండి లేక, స్వదేశం వచ్చేందుకు డబ్బులు లేక అల్లాడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో స్పందించిన విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ వారికి అక్కడ భోజన సదుపాయం, ఇతర ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. భారతీయులను తిరిగి స్వదేశానికి రప్పించేందుకు విదేశాంగశాఖ సహాయ మంత్రి వీకే సింగ్ సౌదీ వెళ్లి అక్కడి ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి. భారత ప్రభుత్వ చర్చలతో స్పందించిన సౌదీ ప్రభుత్వం తమ దేశంలో చిక్కుకుపోయిన భారతీయులకు ఎగ్జిట్ వీసాలు మంజూరు చేసి సొంత ఖర్చులతో భారత్ పంపిస్తామని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా తొలివిడతగా 26 మందికి ఎగ్జిట్ వీసాలు మంజూరు చేసి భారత్ పంపించింది. హామీ మేరకు భారతీయులను పంపించిన సౌదీ ప్రభుత్వాన్ని మంత్రి ప్రశంసించారు. ఢిల్లీలో అడుగుపెట్టే బాధితులను స్వగ్రామాలకు చేర్చేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాశ్ స్వరూప్ కోరారు.