: పాక్ లిటిల్ మాస్టర్ హనిఫ్ మహ్మద్ చనిపోయాడంటూ వార్తలు... బతికే ఉన్నారన్న తనయుడు!
అనారోగ్యంతో బాధపడుతున్న పాకిస్థాన్ మాజీ క్రికెటర్, పాక్ లిటిల్ మాస్టర్ హనిఫ్ మహ్మద్(81) మృతి చెందారని ఇంతకు ముందు మీడియాకు తెలిపిన ఆయన కుమారుడు హనిఫ్ మహ్మద్ షోయబ్ మహ్మద్ మళ్లీ తన తండ్రి బతికే ఉన్నారని స్పష్టం చేశారు. తన తండ్రి అనారోగ్యంతో కరాచీలోని అగాఖాన్ యూనివర్సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారని ఆయన తొలుత మీడియాకు చెప్పడంతో మీడియా ఆ వార్తను ప్రసారం చేసింది. అయితే, కాసేపటికే హనిఫ్ మహ్మద్ కుమారుడు మళ్లీ మీడియా ముందుకు వచ్చి.. తన తండ్రి బతికే ఉన్నప్పటికీ వైద్యులు తనతో ఆయన మృతి చెందినట్లు చెప్పారని అన్నారు. అందుకే తాను కూడా పొరపాటు పడి మీడియా ముందుకు వచ్చి తన తండ్రి చనిపోయినట్లుగా ప్రకటించానని, కానీ హనిఫ్ మహ్మద్ ప్రాణాలతోనే ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. 81 సంవత్సరాల హనీఫ్ గత కొంతకాలంగా ఊపిరితిత్తుల కేన్సర్ తో బాధపడుతున్నారు. కాగా, రెండు చేతులతోనూ బౌలింగ్ చేయగల హనిఫ్ మహ్మద్ తన కెరీర్‌లో మొత్తం 12 సెంచరీలు సాధించి క్రికెట్ అభిమానుల ఆదరాభిమానాలు సొంతం చేసుకున్నారు. 1958-59లో వెస్టిండీస్‌తో ఆడిన టెస్ట్ మ్యాచ్‌లో ఆయన అత్యుత్తమ బ్యాటింగ్‌ను కనబర్చారు. మ్యాచులో లాంగెస్ట్ ఇన్నింగ్స్ ఆడి 337 పరుగులు చేశారు. ఈ ఘనత సాధించిన ఏకైన పాక్ క్రికెటర్ ఆయనే. తన కెరీర్‌లో 43.98 యావరేజ్‌తో మొత్తం 3,915 పరుగులు చేసిన ఆయన ఫస్ట్‌క్లాస్ అత్యుత్తమ స్కోరు 499 పరుగులు.