: కొనేవారు కరవు... బంగారు ఆభరణాలకు 20 శాతం తగ్గిన డిమాండ్!


ఇండియాలో బంగారం దిగుమతి ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో 18 శాతం తగ్గి కేవలం 131 టన్నులకు పరిమితం కాగా, బంగారు ఆభరణాలకు డిమాండ్ 20 శాతం తగ్గిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) తన తాజా నివేదికలో ప్రకటించింది. గత సంవత్సరం రెండో త్రైమాసికంలో 159.8 టన్నుల బంగారం దిగుమతి అయిందని పేర్కొంది. విలువ పరంగా పరిశీలిస్తే, డిమాండ్ 8.7 శాతం తగ్గి రూ. 38,890 కోట్ల నుంచి 35,500 కోట్లకు తగ్గిందని పేర్కొంది. ఏప్రిల్ నెలలో జరిగిన ఆభరణాల వ్యాపారుల సమ్మె కారణంగా బంగారం కొనుగోలు చేసేందుకు అత్యంత శుభప్రదమైన రోజుగా భావించే అక్షయ తృతీయ అమ్మకాలు సైతం ప్రభావితం అయ్యాయని డబ్ల్యూజీసీ భారత మేనేజింగ్ డైరెక్టర్ పీఆర్ సుందరరామన్ వ్యాఖ్యానించారు. పెరిగిన ధరలు, బంగారం కొనుగోలుపై పాన్ కార్డు తప్పనిసరి కావడం, పన్నులు పెరగడం, ఆభరణాలపై ఎక్సైజ్ సుంకాల పెంపు వంటివి గ్రామీణ ప్రాంతాల్లో ఆభరణాలకు డిమాండ్ తగ్గేలా చేశాయని ఆయన అన్నారు. గత సంవత్సరం రెండో త్రైమాసికంలో 122.1 టన్నుల విలువైన ఆభరణాల అమ్మకాలు సాగగా, ఈ సంవత్సరం అది 97.9 శాతానికే పరిమితమైనట్టు కౌన్సిల్ నివేదిక పేర్కొంది. విలువ పరంగా చూస్తే, బంగారం అమ్మకాలు రూ. 29,720 కోట్ల నుంచి 10.8 శాతం తగ్గి రూ. 26,520 కోట్లకు తగ్గాయని వివరించింది. బంగారాన్ని పెట్టుబడికి సరైన ఆప్షన్ గా ఎంచుకుని ఇన్వెస్ట్ చేసేవారు సైతం తగ్గారని, గత సంవత్సరం 37.7 టన్నుల బంగారాన్ని పెట్టుబడుల రూపంలో ఇన్వెస్టర్లు కొనుగోలు చేశారని, ఈ సంవత్సరం 33.1 టన్నుల బంగారంపైనే పెట్టుబడులు ఉన్నాయని తెలిపింది. మొత్తం మీద తొలి ఆరు నెలల కాలంలో బంగారం దిగుమతి గతేడాదితో పోలిస్తే 470 టన్నుల నుంచి 291 టన్నులకు తగ్గిందని వివరించింది. ఈ సంవత్సరం నవంబర్ తరువాతనే దిగుమతులు పెరగవచ్చని అంచనా వేస్తున్నట్టు బులియన్ నిపుణులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News