: ఐఎస్ఐఎస్ వ్యవస్థాపకుడు ఒబామా.. సహ వ్యవస్థాపకురాలు హిల్లరీ!: డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్ష పదవి రేసులో పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ తనకు అలవాటయిన వివాదాస్పద వ్యాఖ్యల జోరుని ఏ మాత్రం తగ్గించుకోకుండా అదే తీరు కనబరుస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ఒబామాపై ఇప్పటికే పలుసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన ఈసారి తన వ్యాఖ్యలను మరింత మసాలా దట్టించి వదిలారు. ఐఎస్ఐఎస్ కొనసాగిస్తోన్న దాడులు మధ్యప్రాచ్యం నుంచి ఐరోపా నగరాలకు విస్తరించాయని వ్యాఖ్యానించిన ట్రంప్.. దాని వ్యవస్థాపకుడు బరాక్ ఒబామే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేగాక, అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా అని ఆయన పూర్తి పేరును ట్రంప్ నొక్కిచెప్పారు. ఒబామాను ఐఎస్ఐఎస్ వ్యవస్థాపకుడిగా వ్యాఖ్యలు చేసిన ట్రంప్.. ఇక తన ప్రత్యర్థి అయిన హిల్లరీ క్లింటన్ ను ఆ ఉగ్రవాద సంస్థకి సహ వ్యవస్థాపకురాలిగా పేర్కొన్నారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై వైట్‌హౌస్ ఎటువంటి స్పందనను తెలపలేదు.