: పోటీ నుంచి ట్రంప్ తప్పుకోవడమే మంచిది.. రిపబ్లికన్లు కోరుకుంటున్నది ఇదే!


అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి వైట్‌హౌస్‌లో అడుగుపెట్టాలని భావిస్తున్న రిపబ్లికన్ పార్టీ నేత ట్రంప్‌కు రోజురోజుకు క్లిష్ట పరిస్థితులు ఎక్కువవుతున్నాయి. మొన్నటి వరకు అధ్యక్ష రేసులో దూసుకుపోతున్నట్టు కనిపించిన ట్రంప్ ఇప్పుడు ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ కంటే వెనకబడిపోయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన పోటీ నుంచి తప్పుకుంటే బాగుంటుందని సొంత పార్టీ వారే అభిప్రాయం వ్యక్తం చేస్తుండడం గమనార్హం. సోమవారం ప్రముఖ పత్రిక జరిపిన సర్వేలో 44 శాతం మంది రిజిస్టర్డ్ ఓటర్లు ట్రంప్ తప్పుకుంటే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 1,162 మందిపై నిర్వహించిన సర్వేలో ఎక్కువ శాతం మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. కాగా ఈనెల 5-8 మధ్య 396 మంది రిజిస్టర్డ్ రిపబ్లికన్లపై చేసిన సర్వేలోనూ ఇలాంటి ఫలితమే వెల్లడైంది. 19 శాతం మంది రిపబ్లికన్లు ట్రంప్ తప్పుకోవాలని కోరుకున్నారు. 70 శాతం మంది ఆయన పోటీలోనే ఉండాలని కోరుకోగా పది శాతం మంది తమకు తెలియదని పేర్కొన్నారు. తాజా సర్వేలో ట్రంప్ తప్పుకోవాలన్న వారి శాతం అమాంతం పెరగడం విశేషం. ట్రంప్ ప్రత్యర్థి డెముక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ పోటీలో ట్రంప్ కంటే ఏడు శాతం పాయింట్లతో ముందువరుసలో ఉన్నారు. ట్రంప్ విధానాలు ముఖ్యంగా ముస్లింలు అమెరికా రాకుండా నిషేధించడం, అమెరికా, మెక్సికో సరిహద్దులో గోడకడతానని పేర్కొనడం తదితర వివాదాస్పద అంశాలే ఇందుకు కారణమని సర్వే తేల్చింది.

  • Loading...

More Telugu News