: అదృష్టవంతుడిని మళ్లీ అదృష్టం వరించింది... విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ వ్యక్తికి జాక్ పాట్... లాటరీలో కోట్లు!


గత వారం జరిగిన ఎమిరేట్స్ విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్న అదృష్టవంతుడు కేరళకు చెందిన మహ్మద్ బషీర్ అబ్దుల్ ఖాదిర్. అరవై రెండు సంవత్సరాల వయసున్న ఆయన్ని మరో అదృష్టం వెతుక్కుంటూ వచ్చింది. ఆ అదృష్టం పేరే లాటరీ! ఆ లాటరీలో ఒక మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారు రూ.6.6 కోట్లు గెలుచుకున్నాడు. గమ్మత్తేమిటంటే, విమాన ప్రమాదం నుంచి బయటపడి వారం రోజులు కూడా తిరగకుండానే లాటరీ గెలవడం విశేషం. మహ్మద్ బషీర్ 37 ఏళ్లుగా దుబాయ్ లో పనిచేస్తున్నాడు. రంజాన్ పండగ సందర్భంగా ఇటీవలే ఆయన కేరళకు వచ్చి గత బుధవారం తిరిగి బయలుదేరి వెళ్లారు. ఆయన ఎక్కిన ఎమిరేట్స్ విమానం దుబాయ్ ఎయిర్ పోర్టులో క్రాష్ ల్యాండ్ అవడంతో మంటలు చెలరేగి, ప్రయాణికులందరూ బతుకు జీవుడా అంటూ ప్రాణాలతో బతికి బయటపడ్డారు. అందులో, మహ్మద్ బషీర్ కూడా ఒకరు. ఇక, లాటరీ టికెట్ విషయానికొస్తే.. స్వదేశం వచ్చి తిరిగి వెళుతున్న ప్రతిసారి లాటరీ టికెట్ కొనడం ఆయనకు అలవాటు. అదే మాదిరిగా ఈ సారి కూడా ఆయన దుబాయ్ ఎయిర్ పోర్టులోని దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలీనియర్ వద్ద ఒక టికెట్ కొనుగోలు చేశాడు. ఆ లాటరీ నిన్న తీయగా ఆయన కొన్న టికెట్ కు కోట్ల రూపాయలు వచ్చాయి. ఈ సందర్భంగా మహ్మద్ బషీర్ మాట్లాడుతూ, విమాన ప్రమాదం జరిగిన సమయంలో తనకు మరో అవకాశమివ్వమని దేవుడిని ప్రార్థించానన్నారు. ఈ లాటరీ తగలడం తనకు చాలా ఆనందంగా ఉందని, ఈ డబ్బును సహాయ కార్యక్రమాలకు వినియోగిస్తానని చెప్పారు. పక్షవాతంతో బాధపడుతున్న కుమారుడు, పెళ్లికి ఎదిగిన ఒక కుమార్తె తనకు ఉన్నారని, వారి కోసం కొంత డబ్బు ఖర్చు చేస్తానని చెప్పిన ఆయన మరో నాలుగు నెలల్లో పదవీ విరమణ చేయనున్నారు.

  • Loading...

More Telugu News