: లైంగిక వేధింపులకు గురైతే మూడు నెలలు లీవ్ పెట్టొచ్చు: కేంద్రం
విధులు నిర్వర్తించే సమయంలో లైంగిక వేధింపులకు గురయ్యే మహిళలకు ఉపశమనం కలిగించే చర్యలను కేంద్రం కల్పించింది. లైంగిక వేధింపులకు గురవుతున్న మహిళల విషయంలో కేంద్రం చేపట్టిన చర్యలపై పార్లమెంటులో లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్... లైంగిక వేధింపులకు గురయ్యే ఉద్యోగినులు ఆ కేసులకు సంబంధించిన విచారణ జరిగే సందర్భంలో మూడు నెలల పాటు సెలవు తీసుకోవచ్చని ప్రకటించారు. అందుకు లిఖిత పూర్వకంగా దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఆ సంస్థ యజమాని నుంచి ఈ సెలవులు పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. విధులు నిర్వర్తించే సమయంలో గురయ్యే లైంగిక వేధింపులకు సంబంధించిన సమాచారం ఏదీ కేంద్రం వద్ద లేదని ఆయన తెలిపారు. చట్ట ప్రకారం మహిళలను భౌతికంగా తాకడం, అసభ్యంగా వ్యవహరించడం, లైంగిక వాంఛలు తీర్చాలని డిమాండ్ చేయడం, విజ్ఞప్తి చేయడం, అసంబద్ధమైన సైగలు చేయడం, నీలి చిత్రాలు, బొమ్మలు చూపించడం, లైంగికపరమైన మాటలు మాట్లాడటం వంటివన్నీ కూడా లైంగిక వేధింపుల కిందికి వస్తాయి.