: పాకిస్థాన్ కు సాయం చేసిన నేరానికి... బంగ్లాదేశ్ మాజీ ఎంపీకి ఉరిశిక్ష ఖరారు
బంగ్లాదేశ్ మాజీ ఎంపీ షాకావత్ హుస్సేన్ కు యుద్ధనేరాలను విచారిస్తున్న ట్రైబ్యునల్ ఉరిశిక్ష విధించింది. బంగ్లాదేశ్ స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో యుద్ధనేరాలకు పాల్పడ్డ కేసులను విచారిస్తున్న ట్రైబ్యునల్ జమాతే ఇస్లామీ పార్టీకి చెందిన షాకావత్ హుస్సేన్ కు ఉరిశిక్ష విధించి, కొంత మందికి జీవిత ఖైదు శిక్షను ఖరారు చేసింది. ఆయన విద్యార్థి దశలో ఈ పార్టీకి చెందిన విద్యార్థి విభాగం ఇస్లామీ ఛత్రసంఘ కేంద్ర కమిటీలో సభ్యుడిగా పని చేశారు. స్వాతంత్ర్యోద్యమ సమయంలో దేశ విముక్తికి పోరాడాల్సింది పోయి, పాకిస్థాన్ కు సహాయం చేసి, దేశద్రోహానికి పాల్పడ్డాడని నిర్ధారించిన ట్రైబ్యునల్ అతనికి ఉరిశిక్ష విధించింది. అయితే, ట్రైబ్యునల్ విధించిన శిక్షపై సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేస్తామని ఆయన తరపు న్యాయవాది తెలిపారు. కాగా, బంగ్లాదేశ్ స్వాతంత్ర్యోద్యమ సమయంలో దేశానికి వ్యతిరేకంగా పనిచేసిన పలువురికి ఈ మధ్య కాలంలో ఉరిశిక్ష విధిస్తున్న సంగతి తెలిసిందే.