: జీవీఎంసీ పబ్లిక్ వర్క్స్ ఏఈఈ మాధవరావు ఇంట్లో సోదాలు... 15 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు
జీవీఎంసీలో తిష్టవేసిన అవినీతి జలగ నివాసాలపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో విరుచుకుపడ్డారు. దీంతో అతని అవినీతి సంపద బట్టబయలైంది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లోని పబ్లిక్ వర్క్స్ విభాగంలో ఏఈఈగా పని చేస్తున్న మాధవరావుపై అవినీతి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో నిఘా వేసిన ఏసీబీ అధికారులు, అతని పనిపట్టేందుకు రంగంలోకి దిగారు. నేటి ఉదయం అతని ఆస్తులపై ఏకకాలంలో దాడులు చేసి, 15 కోట్ల రూపాయలకుపైగా అవినీతి ఆస్తులున్నట్టు గుర్తించారు. దేవరాపల్లిలో 8 ఎకరాల పామాయిల్ తోట, డాబాగార్డెన్స్, దసపల్లా హిల్స్, ద్వారాకానగర్ లలో నివాసాలు, భీమిలి బీచ్ రోడ్డులో 800 గజాల విస్తీర్ణం చొప్పున రెండు ఫ్లాట్లు, ఇంట్లో 20 తులాల బంగారు ఆభరణాలు, బ్యాంకు లాకర్లలో 30 తులాల బంగారం, కొంత నగదు గుర్తించినట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి.