: విదేశీయుల హైటెక్ దొంగతనం.. కేరళలోని ఏటీఎంలో రూ.4.5 లక్షలు చోరీ
కేరళలో ముగ్గురు విదేశీయులు హైటెక్ దొంగతనానికి పాల్పడ్డారు. తిరువనంతపురంలోని అల్తారా జంక్షన్ లోని ఒక పబ్లిక్ సెక్టార్ బ్యాంకు ఏటీఎంలో వీరు ఒక పరికరాన్ని అమర్చారు. ఈ పరికరం సాయంతో ఏటీఎంను వినియోగించిన వారి కార్డు, పిన్ నంబర్లను తెలుసుకోగలిగారు. ఆ వివరాలతో నకిలీ ఏటీఎం కార్డులు తయారు చేసి వినియోగదారుల అకౌంట్ల నుంచి నగదు డ్రా చేశారు. తమకు తెలియకుండా డబ్బు డ్రా చేశారంటూ అసలు వినియోగదారులు బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, 22 మంది ఖాతాదారుల అకౌంట్ల నుంచి సుమారు రూ.4.5 లక్షలు చోరీకి గురైనట్లు తెలిసిందన్నారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా ముగ్గురు విదేశీయులు ఈ చోరీకి పాల్పడినట్టు తేలిందని, వీరు ఏటీఎంకు ఒక పరికరాన్ని అమర్చడాన్ని తాము గుర్తించామని తెలిపారు. పరారీలో ఉన్న నిందితులలో ఒకరు ముంబయిలో పోలీసులకు చిక్కాడని, ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.