: అవకాశాలు కల్పించడానికి నాకు గాడ్‌ఫాదర్, సూపర్‌స్టార్ బాయ్‌ఫ్రెండ్స్ ఎవరూ లేరు: నటి అమృతరావ్
టాలీవుడ్ హీరో మహేశ్ బాబు నటించిన ‘అతిథి’ చిత్రంలో తెలుగు ప్రేక్షకులని అలరించిన బాలీవుడ్ నటి అమృతరావ్ ఆ సినిమా అనంతరం మరే తెలుగు సినిమాలోనూ కనిపించలేదు. మరోవైపు బాలీవుడ్‌లోనూ కొన్ని సినిమాల్లోనే కనిపించిన ఆమె.. తారస్థాయిలో మెరవలేకపోయింది. ప్రస్తుతం ఆమె టీవీ సీరియళ్లలో కనపడుతోంది. తనకున్న సింగింగ్ టాలెంట్‌నూ ఉపయోగించుకుంటోంది. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తాను సినిమాల్లో ఎక్కువగా నటించకపోయినా తాను నటించిన కొన్ని సినిమాలతోనే మంచి గుర్తింపు వచ్చిందని పేర్కొంది. తాను అగ్ర దర్శకుల చిత్రాలలో తన నిబంధనల మేరకే నటించినట్లు అమృతరావ్ తెలిపింది. తాను పై స్థాయికి వెళ్లాలి అంటూ ఎవరితోనూ పోటీ పడలేదని, ఈ అంశంలో తాను సంతోషంగా వున్నానని పేర్కొంది. తనకు బాలీవుడ్లో ప్రోత్సహించేందుకు ఎవరూ లేరని తెలిపింది. సినిమాల్లో తనకు అవకాశాలు కల్పించడానికి గాడ్‌ఫాదర్, సూపర్‌స్టార్ బాయ్‌ఫ్రెండ్స్ అంటూ ఎవరూలేరని చమత్కరించింది. అయినప్పటికీ తాను కొన్ని సినిమాలు చేశానని, అందుకు తాను గర్వంగా ఫీలవుతున్నానని ఆమె పేర్కొంది. 2010లో తన ముందుకు మంచి అవకాశం వచ్చిందని, తాను ఆ సమయంలో మూడు భారీ చిత్రాల్లో అమితాబ్ బచ్చన్, టబు వంటి తారలతో కలిసి పనిచేసే అవకాశాన్ని పొందినట్లు పేర్కొంది. సినిమాల్లో తాను పాడిన పాటలకు తనకు డబ్బులు కూడా వచ్చాయని ఆమె తెలిపింది. కానీ అదృష్టం బాగోలేక ఆ చిత్రాలు సెట్స్‌పైకి వెళ్లలేదని, అదే తన కెరీర్‌కు మైనస్ పాయింట్‌గా మారిందని చెప్పింది.