: పోలీసులకు మస్కా కొట్టి తప్పించుకున్న కిడ్నీ రాకెట్ సూత్రధారి.. తెల్లమొహం వేసిన ఖాకీలు
కిడ్నీ రాకెట్ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ఢిల్లీకి చెందిన డాక్టర్ అమిత్ రావత్ పోలీసులకు ఝలక్కిచ్చాడు. గుజరాత్‌లో పట్టుబడిన రావత్‌ను రైలులో ఢిల్లీకి తరలిస్తుండగా పోలీసులకు మస్కా కొట్టి తప్పించుకుని పారిపోయాడు. దీంతో పోలీసులు తెల్లమొహం వేశారు. విషయం తెలిసిన ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఆయుర్వేద వైద్యుడైన రావత్ సర్జరీలు చేస్తూ వ్యక్తుల కిడ్నీలను తొలగించేవాడు. ఆపై వాటిని పెద్దమొత్తంలో విక్రయించేవాడు. ఇలా దాదాపు గుజరాత్‌లోని ఆనంద్ పట్టణానికి సమీపంలోని పండోలి గ్రామానికి చెందిన 13 మంది కిడ్నీలు తొలగించి విక్రయించాడు. ఈ కేసులో గత నెల 29న అజ్మీర్ సమీపంలో రావత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా ఆయనను తిరిగి సోమవారం రాత్రి స్వర్ణ జయంతి ఎక్స్‌ప్రెస్ రైలులో ఢిల్లీకి తీసుకొస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. విషయం తెలిసిన ఉన్నతాధికారులు అతడిని పట్టుకునేందుకు రెండు బృందాలను రంగంలోకి దింపారు. రావత్‌పై 1995, 2008లోనూ ఇటువంటి కేసులే నమోదయ్యాయి. ఓ కేసులో ఆయనకు ఏడేళ్ల జైలు శిక్ష కూడా పడింది. అయితే ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్నాడు. పండోలి గ్రామస్తుడు ఒకరు తనకు తెలియకుండా రావత్ తన కిడ్నీని తొలగించాడని ఫిర్యాదు చేయడంతో మరోసారి రావత్ లీలలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో రావత్ సహా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.