: కశ్మీర్ విషయంలో షరీఫ్ మరోమారు కారుకూతలు.. బాధిత ప్రజల గొంతుకనవుతానన్న పాక్ ప్రధాని


కశ్మీర్ విషయంలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ మరోమారు కారుకూతలు కూశారు. అక్కడి ప్రజలు అణచివేతకు గురవుతున్నారని, తాను వారి గొంతుకనై నినదిస్తానని పేర్కొన్నారు. ఓ ప్రధానిగా తనపై ఆ బాధ్యత ఉందన్నారు. అక్కడి ప్రజల దురవస్థను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని జారవిడుచుకోనని పేర్కొన్నారు. అంతేకాదు, కశ్మీర్‌లో ప్రస్తుతమున్న పరిస్థితిని చక్కదిద్దే చర్యలు తీసుకోవాల్సిందిగా ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ బాన్‌కీమూన్, మానవహక్కుల హై కమిషనర్ జీద్ రాడ్ అల్‌కు లేఖ రాస్తానన్నారు. అలాగే ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ తీర్మానాలను కశ్మీర్‌లో అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతానని పేర్కొన్నారు. త్వరలో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ(యూఎన్‌జీఏ) సమావేశం జరగనున్న నేపథ్యంలో విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ సహా పలువురు ఉన్నతాధికారులతో షరీఫ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ‘‘స్వయం నిర్ణయాధికారం అనేది కశ్మీరీల ప్రాథమిక హక్కు. వారి నౌకను వారే నడిపించుకునేందుకు ఓ కెప్టెన్‌ను ఏర్పాటు చేసేందుకు కావలసిన అన్ని చర్యలు తీసుకుంటాం’’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో ఇదో కొత్త ఒరవడి అంటూ గతంలో పేర్కొన్న షరీఫ్, కశ్మీర్ భారత అంతర్గత సమస్య కాదని ప్రపంచానికి చాటిచెప్పాలంటూ దౌత్యవేత్తలను కోరిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News