: మోదీ, కేసీఆర్ పరస్పరం ప్రశంసించుకుంటూ ఎవరి డబ్బా వారు కొట్టుకున్నారు!: సురవరం సుధాకర రెడ్డి
ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ పరస్పరం ప్రశంసించుకుంటూ ఎవరి డబ్బా వారు కొట్టుకున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర రెడ్డి విమర్శించారు. వారు పరస్పరం పొగుడుకోవడమనేది గాడిద గాత్రాన్ని కాకి, కాకి సంగీతాన్ని గాడిద మెచ్చుకున్నట్లుగా ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పర్యటనలో భాగంగా రెండురోజుల క్రితం గజ్వేల్ కు వచ్చిన ప్రధాని మోదీ తెలంగాణలో అభివృద్ధి బాగుందంటూ ఊదరగొట్టారన్నారు. అదేరోజు సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన బహిరంగ సభలో బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మాత్రం హైదరాబాద్ లో ఎటువంటి అభివృద్ధి జరగలేదంటూ విమర్శించారన్నారు. వీళ్లిద్దరూ చేసిన వ్యాఖ్యల్లో ఏది నిజమో వారే చెప్పాలన్నారు. కేంద్రంలో అవినీతి రహిత ప్రభుత్వం ఉందంటూ కేసీఆర్ ప్రశంసలు కురిపించడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. కేంద్ర కేబినెట్ లో తన కుటుంబ సభ్యులను చేర్చాలనే ఆశ కేసీఆర్ లో ఇంకా పోలేదని ఆయన ఆరోపించారు.