: ‘హోదా’ ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు: సీతారాం ఏచూరి
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాపై కేంద్ర వైఖరిని చూస్తుంటే రాష్ట్రానికి హోదా వచ్చే అవకాశాలు కనిపించడం లేదని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఈరోజు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి హోదాపై పోరాటాలు కొనసాగించాలని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ సాక్షిగా ఆనాడు ఏపీకి ప్రత్యేక హోదాపై హామీలు గుప్పించారని ఆయన అన్నారు. హామీలు అమలు చేయాల్సిందేనని అన్నారు. 'ఆంధ్రప్రదేశ్ కు హోదాపై చర్చ అవసరమని ఏచూరి అన్నారు. హోదా ఇస్తే మిగతా రాష్ట్రాల నుంచి సమస్యలేమైనా వస్తాయా? అన్న అంశంపై చర్చించాలని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలోనే ఏపీకి హోదా ఇస్తామన్నారని, తాము ఆనాడు కేంద్రం చేస్తున్న అసంబద్ధ విభజనను ఖండించామని పేర్కొన్నారు. అన్ని అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా విభజన చేయొద్దని తాము కోరినట్లు గుర్తు చేశారు. ఆనాడు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ స్పందిస్తూ.. రాష్ట్రానికి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారని అన్నారు. ఇక వెంకయ్యనాయుడు తాము అధికారంలోకి వస్తే ఏకంగా పదేళ్లు హోదా ఇస్తామని అన్నారని ఏచూరి అన్నారు. ఇప్పుడు ఆ హామీలన్నీ మరచిపోయారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హోదా సాధించుకునే క్రమంలో సీపీఎం సహకారం ఉంటుందని స్పష్టం చేశారు.