: శివార్ల నుంచి ఎయిర్ పోర్టు వరకూ... తొలి భూగర్భ రైల్వేకు సిద్ధమవుతున్న భాగ్యనగరి!
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో తొలి భూగర్భ రైల్వేకు మార్గం సుగమమవుతోంది. శివారు ప్రాంతమైన ఉందానగర్ నుంచి శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వరకూ దీన్ని నిర్మించాలని భావిస్తున్న రైల్వే శాఖ, అందుకు సాధ్యాసాధ్యాలపై సర్వే జరిపి, రిపోర్టును ఇవ్వాలని రైట్స్ (రైల్వే ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్)ను గతంలోనే ఆదేశించగా, ఈ మేరకు అతిత్వరలో నివేదిక రైల్వే శాఖకు అందనున్నట్టు తెలుస్తోంది.ఎంఎంటీఎస్ రెండో దశ విస్తరణలో భాగంగా ఎయిర్ పోర్టు వరకూ సర్వీసులు పొడిగించాలని వైఎస్ హయాంలోనే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఫలక్ నుమా స్టేషన్ వరకూ మాత్రమే ఎంఎంటీఎస్ లు తిరుగుతున్నాయి. ఎయిర్ పోర్టు వరకూ రైల్వే ట్రాక్ వేయడానికి జీఎంఆర్ సంస్థ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. భవిష్యత్తులో మరో రన్ వే, అదనపు టెర్మినళ్ల కోసం దాచి వుంచిన స్థలాన్ని ట్రాక్ కోసం ఇవ్వలేమని తేల్చడంతోనే భూగర్భ రైల్వే లైన్ ఆలోచన వచ్చింది. కాచిగూడ - మహబూబ్ నగర్ మధ్య ఉన్న ఉందానగర్ స్టేషన్ ఎయిర్ పోర్టుకు దగ్గరగా ఉండటంతో, అక్కడి నుంచి సొరంగం తవ్వి ఎయిర్ పోర్టు వరకూ పట్టాలు నిర్మించాలన్నది రైల్వే శాఖ యోచన. రెండు రోజుల క్రితం నగరానికి వచ్చిన రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ తో ప్రత్యేకంగా చర్చించినట్టు తెలుస్తోంది.