: కొత్త ఆవిష్కరణ... గాలి ఎటు వీస్తే అటు తిరిగే అద్భుత ఇల్లు!


ఇంట్లో కూర్చుని ఉన్న‌ప్పుడు మ‌న ఇల్లు ఒక్క‌సారిగా క‌దులుతున్నట్లు అనిపిస్తే.. భూకంపం వ‌చ్చింద‌నో, ఏదో ప్ర‌మాదం జ‌రుగుతోంద‌నో భ‌య‌ప‌డిపోతాం. అయితే న్యూయార్క్‌లో అలెక్స్ షెవెదర్, వార్డ్ షెల్లీ అనే ఇద్దరు వ్య‌క్తులు త‌యారు చేసిన ఇంట్లో ఉంటే మాత్రం ఇల్లు క‌దులుతున్న అనుభూతి ప్ర‌తిరోజు పొందాల్సిందే. గాలి ఎటు వీస్తే అటు వైపే ఇల్లు మొత్తం తిరిగేలా ఈ నిర్మాణం చేపట్టారు మరి! 2007 నుంచి కలిసి పనిచేస్తున్న ఆర్కిటెక్టులు ఇళ్ల నిర్మాణ రంగంలో ఆరితేరారు. విభిన్నంగా ఇళ్ల‌ నిర్మాణాలను చేప‌డ‌తారు. వారి మెద‌ళ్ల‌లోంచి పుట్టుకొచ్చిన మ‌రో ఆలోచ‌నే ఈ క‌దిలే ఇల్లు. అంతరిక్షంలో తేలియాడే వస్తువుపై ఉంటే మ‌న‌పై ఎలాంటి ప్రభావం పడుతుంది? అన్న ఊహ నుంచి పుట్టికొచ్చిందే గాలి ఎటు వీస్తే అటు తిరిగే ఈ ఇళ్ల నిర్మాణం. న్యూయార్క్ లోని గెంట్ లోని ఓమి ఇంటర్నేషనల్ ఆర్ట్స్ సెంటర్ లో అలెక్స్ షెవెదర్, వార్డ్ షెల్లీ ఈ ఇళ్ల నిర్మాణం చేప‌ట్టారు. ఒక పెద్ద గుండ్రటి సిమెంట్ పిల్లర్‌పై 8 అడుగుల ఎత్తులో రియాక్టర్ అనే ఈ ఇంటిని వారు నిర్మించారు. ఈ ఇంటి మ‌రో ప్ర‌త్యేక‌త ఏంటంటే, మ‌నం అందులో న‌డుస్తుంటే మ‌న శ‌రీర‌ బరువుకు తగినట్లుగా ఇల్లు కూడా వంగిపోతుంది. ఈ ఇంట్లో అలెక్స్ షెవెదర్, వార్డ్ షెల్లీ ఐదు రోజులు నివాసం కూడా ఉన్నారు. ఈ ఇంటిని చూసేందుకు వ‌చ్చిన వారికి ఇంట్లో తాము పొందిన అనుభవాలను తెలిపారు. క‌దిలే ఈ ఇంటిని రెండు ఏళ్ల పాటు ప్రదర్శనకు ఉంచాల‌ని చూస్తున్నారు. వచ్చే రెండు నెల‌లు అలెక్స్ షెవెదర్, వార్డ్ షెల్లీ కొన్ని రోజులు ఈ ఇంట్లో బ‌స‌చేస్తార‌ట‌.

  • Loading...

More Telugu News