: గోదావరి పుష్కరాల్లో నేనో మహాసంకల్పం చేశా: ముఖ్యమంత్రి చంద్రబాబు
చిత్తూరు జిల్లాలోని తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈరోజు పర్యటిస్తున్నారు. అక్కడి కమతమూరులో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. గోదావరి పుష్కరాల్లో తానో మహాసంకల్పం చేసినట్లు తెలిపారు. గోదావరి తల్లిని కరవు పోవాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఏడాదిలోపు పట్టిసీమ పూర్తి చేసినట్లు, కుప్పంకి నీళ్లు తీసుకువస్తున్నట్లు ఆయన తెలిపారు. తాగునీటి కోసం వలసపోయే అవసరం ఇప్పుడు లేదని ఆయన అన్నారు. ప్రతి కుటుంబం తమ ఇంట్లో నెలకి ఎంత ఖర్చు అవుతోందనే విషయాన్ని లెక్కలు వేసుకోవాలని, తమ ఆదాయాన్ని పెంచే మార్గం ఏంటో.. తమ ఖర్చులు తగ్గించే మార్గాలేవో నిర్ణయం తీసుకుని జీవించాలని ఆయన సూచించారు. రాష్ట్రంలోని ప్రజలందరి కనీస అవసరాలన్నీ తమ ప్రభుత్వం తీరుస్తుందని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వం ఐదు లక్షల ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు, ఏడాదికి లక్షచొప్పున ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏపీ ప్రజలు సాంకేతికంగా మరింత అభివృద్ధి చెందాలని ఆయన సూచించారు. సభలో సెల్‌ఫోన్‌లు ఉన్నవాళ్లు చేతులు ఎత్తాలని సూచించిన చంద్రబాబు.. మహిళలు తక్కువ సంఖ్యలో చేతులు ఎత్తడాన్ని చూసి ‘మా ఆడబిడ్డలకింకా సెల్‌ఫోన్లు రాలేదు’ అని వ్యాఖ్యానించారు. అందరూ డిజిటల్ రంగంలో అడుగుపెట్టాలని, అందుకు తాము కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.