: పాక్ లో న్యాయవాది అంత్యక్రియల వేళ ఉగ్రదాడి... న్యాయవాదులు, జర్నలిస్టులు సహా 40 మంది మృతి
బెలూచిస్థాన్ బార్ అసోసియేషన్ న్యాయవాది బిలాల్ అన్వర్ కాశి గుర్తు తెలియని వ్యక్తుల కాల్పుల్లో మరణించగా, ఆయన అంత్యక్రియల వేళ ఉగ్రవాదులు శక్తిమంతమైన బాంబును పేల్చడంతో 40 మందికి పైగా మరణించారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో అత్యధికులు న్యాయవాదులేనని, మృతుల్లో కొందరు జర్నలిస్టులు కూడా ఉన్నారని తెలుస్తోంది. క్వెట్టాలోని ఓ ఆసుపత్రి నుంచి అన్వర్ కాశి మృతదేహాన్ని తరలిస్తున్న వేళ ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. పేలుడు అనంతరం ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డు వద్ద తుపాకుల కాల్పులు కూడా వినిపించాయని 'ది ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్' ప్రకటించింది. కాగా, బెలూచిస్థాన్ హోం మంత్రి సర్ఫరాజ్ బుగ్తీ మీడియాతో మాట్లాడుతూ, 30 మందికి పైగా మరణించారని పేర్కొన్నారు. ఆసుపత్రిలో భద్రతా వ్యవస్థ వైఫల్యమే ఘటనకు కారణమని, తాను స్వయంగా విచారిస్తున్నానని తెలిపారు. దాడి జరిపింది ఆత్మాహుతి దళ సభ్యుడని అనుమానిస్తున్నట్టు వెల్లడించారు. ఈ ఘటనకు పాల్పడింది తామేనని ఇంతవరకూ ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటించుకోలేదు.